జానపద సాహిత్యంలో…. భట్టి విక్కమార్కుల కథలది ప్రత్యేక స్థానం. విక్రమాదిత్యుడు మహారాజు, భట్టి ఆయనకు మహామంత్రి. విక్రమాదిత్యుడి గొప్పతనమూ, ఆయనకు సోదరుడూ మంత్రీ కూడా అయిన భట్టి మేధావిత్వం గురించిన కథలివి.
ఈ కథలు దాదాపు 365 ఉండేవి. రోజుకో కథ చెప్పుకుంటే, పూర్తికావటానికి సంవత్సరం పడుతుంది. ఇప్పుడు కొన్ని కథలే లభ్యమౌతున్నాయి.
ఒక కథలో నుండి మరో కథ, కంఫ్యూటర్ లో మనం ఒక విండో లోంచి మరో దానిలోకి, ఒక ఫోల్డర్ లోంచి మరో దాన్లోకి ప్రయాణించినట్లుగా ఉంటుంది. కథల నిండా అద్భుతరసమే! సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే సంఘటనలు, కథల్లో మలుపులు, స్ఫూర్తి నింపే సాహసాలు, చక్కని వర్ణనలతో పాటు, సాహసాలు, వితరణ శీలం, ఇతరులకు సహాయపడటం వంటి మానవ సహజ సుగుణాలకు ప్రాధాన్యత కనబడుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే – ఈ కథలలో అవధుల్లేనంతటి ఊహాశక్తితో, అజ్ఞాత కవి ఎవరో, మనల్ని అద్భుతలోకాల్లోకి…. అతివేగంగా, అతి రమ్యంగా తీసికెళతాడు. ప్రాచీనకాలంలో, సంస్కృత లిపిలో ‘భట్టి విక్రమార్క సంవాదం’ పేరిట ఒక గ్రంధం ఉండేదట. కాలక్రమంలో దాని లభ్యత మృగ్యమైంది. తెలుగులోకీ, ఇతర భాషల్లోకీ ఈ కథల అనువాదాలున్నాయి. చాలా కథలు, తరం నుండి తరానికి ‘అమ్మమ్మ తాతయ్యల దగ్గర కథలు చెప్పించుకోవడం’ రూపేణా సంక్రమించాయి. వీటిల్లో కొన్ని కథలని, పిల్లల పుస్తకాలలో ఉన్నాయి. కొన్ని కథలు సినిమాలుగా వచ్చాయి.
ఎప్పుడు ఎవరికి చెప్పినా…. శ్రోతల్లో ఎంతో సంభ్రమాశ్చర్యాలూ, సంతోషమూను! చెప్తూ నేనూ ఎంతో ఆనందించేదాన్ని.
నిజానికి ఈ కథలు, పిల్లల్లో చక్కని వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ధృఢమైన, నిర్దిష్టమైన వ్యక్తిత్వాన్ని! ఇలాంటి కాల్పనిక కథలు చదవటం రీత్యా, పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. తమదైన ప్రపంచాన్ని ఆనందిస్తారు. దాంతో సృజనాత్మకత పెరుగుతుంది. ధైర్య సాహసాలు, పట్టుదల, సహనం, పెద్దల పట్ల వినయం, భక్తి, నమ్మకం వంటి మానవీయ విలువలు అలవడతాయి. అంతేకాదు, తార్కిక ఆలోచన, సునిశిత పరిశీలన, విషయ విశ్లేషణ, సాహసాలకు పూనుకోవటం, సవాళ్ళను స్వీకరించటం వంటి లక్షణాలూ గ్రహిస్తారు.
ఈ కథలు వాళ్ళని చక్కని మార్గంలో నడిపిస్తాయి. భావప్రసార శక్తిని పెంపొందిస్తాయి. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రభావితుల్ని చేయాలి, ఎలా స్ఫూర్తిపూరితులని చేయాలి, ఇతరులని ఎలా ఒప్పించి తమ మార్గంలోకి తెచ్చుకోవాలి, ఎలా సంతోషపరచాలి… ఇలాంటివన్నీ! వీటితో పాటు…. సమయోచితంగా, సందర్బోచితంగా, హాస్య స్ఫూరకంగా ఎలా మాట్లాడాలో కూడా! ఈ కథలు పూర్తయ్యేసరికల్లా, కథనాయకులైన భట్టి, విక్రమాదిత్యులు పిల్లలకు ఆదర్శం, ‘రోల్ మోడల్స్’ అయిపోతారు.
వాళ్ళలాగే తామూ అన్నీ కళలనీ, జ్ఞానాన్ని నేర్చేసుకోవాలనిపిస్తుంది. నిజానికి ఈ కథల సృష్టికర్త ఎవరో తెలియదు. భట్టి విక్రమార్కులు ఉజ్జయినీ నగరాన్ని, వేల సంవత్సరాల పాటు పరిపాలించిన మంత్రి, చక్రవర్తులని నమ్మకం. అతిశయోక్తులున్నా అది చారిత్రక సత్యం అంటారు. కల్పనలు జోడించబడినా, ఈ కథలు పిల్లల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
చదువరుల మీద ఈ కథలు వేసే ముద్ర బలమైనది.
మీ ఇళ్ళల్లోని చిన్నారులకి, ఈ మజాని పంచుతారని ఆశిస్తూ…. ఈ కథా పరంపర….!
అది ప్రాచీన కాలం! ఈ కథ ప్రాచీన భారత దేశంలో సంభవించింది. ఆ కాలంలో భారత దేశం భూలోక స్వర్గంలా ఉండేది. మూడు దిక్కులా ఆవరించిన సముద్రాలు, ఉత్తర దిక్కున ఠీవిగా నిలిచిన హిమాలయ పర్వతాలతో, వెల లేని రత్నాలూ విలువైన లోహాలూ కలిగి, ఒకేసారి నిండు గర్భిణి లాగానూ, పచ్చి బాలింత లాగానూ ఉండేది. వెండి బంగారు రాగి ఇనుము వంటి లోహాలూ, రత్నాలూ వజ్రలూ ప్రజలకి సునాయసంగా లభ్యమయ్యేవి. చల్లని, సౌకర్యవంతమైన, అందమైన, పచ్చని ప్రకృతి పరచుకొని ఉండేది. ఆ జీవగడ్డపై సంవత్సరమంతా ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా పచ్చని పైరులు చిరుగాలికి ఊగుతుండేవి. నదీ నదాల గలగలలతో, పశుపక్షుల కిలకిలలతో, అరణ్యాలతో అలరారు తుండేది. అక్కడక్కడా విసిరేసినట్లుగా జనవాసాలు… గ్రామాలు, నగరాలు! పచ్చని ప్రకృతిలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తుండేవాళ్ళు. అలాంటి భారతదేశంలో అది దక్షిణ భూభాగం! పుడమి తల్లికి నుదుటి సింధూరంలా ధారానగరం అనే పట్టణం ఉండేది. ఆ నగరంలో ఇళ్ళన్నీ మిద్దెలూ మేడలే! పలు అంతస్ధుల భవనాలతో అందంగా ఉండే నగరం! అక్కడి ఇళ్ళకు తోరణాలుగా మామిడాకులు గాక, మణులతో చేసిన హారాలు వేలాడుతుండేవి. దొంగభయం లేదు. దోపిడిల భయమూ లేదు. ప్రజలంతా ఎంతో శాంతి సౌఖ్యాలతో ఉండేవాళ్ళు. ధారా నగరం భోజరాజు యొక్క రాజధాని. భోజరాజు ఎంతో మంచివాడు, దయగలవాడు, ధర్మపరుడు. తన ప్రజల పట్ల బాధ్యత కలవాడు. అతడెల్లప్పుడూ తన ప్రజల క్షేమం గురించే ఆలోచించేవాడు. అతడి పన్ను విధానం ప్రజలకి ఏమాత్రం భారంగానూ, బాధ గానూ ఉండేది కాదు. అతడి పాలనా విధానం, పరిపాలనా యంత్రాంగం…. ఎల్లప్పుడూ ప్రజలకి సౌకర్యవంతంగా, ప్రజలని రక్షించేవిధంగా ఉండేది. అతడు తన రాజ్యంలోని ప్రజలని ప్రేమించేవాడు, అన్ని విధాలా రక్షించేవాడు. ప్రతిగా ప్రజలూ అతణ్ణి ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఒకరోజు భోజరాజు, తన ప్రధానమంత్రి బుద్ది సాగరుణ్ణి పిలిచాడు. బుద్ది సాగరుడు మంచివాడు, మేధావి, వివేకం గలవాడు. బుద్దిసాగరుడు అంటే సాగరము వంటి గొప్పబుద్ది కలవాడు, బుద్దికి సాగరము వంటి వాడు అని అర్ధం! అతడా పేరుకు తగినవాడు. భోజరాజు “ప్రియమైన ప్రధానమంత్రి, బుద్ది సాగరా! మన గూఢచారులు తెల్పిన సమాచారం ప్రకారం, మన గ్రామీణులు కౄర, వన్య మృగాల వలన బాధలు పడుతున్నారు. అరణ్యాలు దట్టంగా ఉన్నాయి. వన్య, కౄర మృగాల సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో అడవి మృగాలు పచ్చని పొలాలని నాశనం చేస్తున్నాయి. కౄర మృగాలు అమాయక గ్రామీణులని, వారి పెంపుడు జంతువులని గాయపరుస్తున్నాయి. ప్రజలని కాపాడటం మన ధర్మం! అందుచేత రేపటి రోజున వేటకు వెళ్ళాలని నిశ్చయించాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. మన సైన్యంలో నుండి కొన్ని దళాలని సమాయత్త పరచండి. నగరంలో ఉత్సాహం గల యువకులని, వేటకు రావలసిందిగా దండోరా వేయించండి” అని అజ్ఞాపించాడు. బుద్దిసాగరుడు చిరునవ్వుతో “చిత్తం మహారాజా! రేపటి ఉదయానికల్లా వేటకి అన్ని ఏర్పాట్లు చేస్తాను” అన్నాడు. మరునాటి ఉదయానికి భోజరాజు వేట కెళ్ళేందుకు సిద్దమయ్యాడు. ఉత్సాహం గల చాలామంది యువకులు వేటకు తగిన ఆయుధాలు…. కత్తులూ, విల్లంబులూ, ఈటెలూ ధరించి, కోట ముందు సమావేశమయ్యారు. వారి కేరింతలతో అక్కడంతా సందడిగా ఉంది. సైనికులూ, యువకులూ కదం తొక్కుతూ, గొంతెత్తి పాడుతున్నారు. సంగీత పరికరాలతో పాటకు అందుకనుగుణంగా తాళం వేస్తున్నారు. వాళ్ళ పాటల రాగాలు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. రజోగుణాన్ని ప్రేరేపిస్తూ రోమాంచితం చేస్తున్నాయి. అక్కడంతా పండగ వాతావరణం వెలిసింది. [మానవ మనస్తత్వాన్ని భగవద్గీత, మూడు రకాలుగా నిర్వచిస్తుంది. సత్త్వం, రజస్సు, తమోగుణం. మనుషులందరిలో ఈ మూడు గుణాలూ ఉంటాయి. రజస్తమో గుణాల కంటే సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నవారిలో…. సహనం, జ్ఞానం, శాంత స్వభావం, అహింసాతత్త్వం వంటి లక్షణాలు ఉంటాయి. రజోగుణం ఎక్కువగా ఉన్నవారిలో…. ధైర్యసాహసాలు, పోరాటపటిమ, నాయకత్వ స్ఫూర్తి వంటి లక్షణాలు ఉంటాయి. తమోగుణం ఎక్కువగా ఉన్నవారిలో…. అవివేకం, వితండవాదం, సోమరితనం, నిద్ర వంటి లక్షణాలు ఉంటాయి.] ఈ విధంగా రజోగుణ ప్రవర్ధమాన పరిస్థితులలో…. భోజరాజు, మంత్రి బుద్దిసాగరుడు, సైనికులూ, యువకులూ వేటకు బయలు దేరారు. అరణ్యప్రాంతం చేరారు. అరణ్య మధ్యంలో విడిదిని ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రివేళల విశ్రాంతికి, విందు వినోదాలకి గుడారాలు నిర్మించుకున్నారు. పగటి వేళల్లో అడవి జంతువుల వేట కొనసాగించారు. డప్పు వంటి వాయిద్యాలని గట్టిగా మోగిస్తూ అరణ్య మృగాలని భయపెట్టారు. భయంతో వాటి ఆవాసాల నుండి బయటికొచ్చి పరుగులు తీస్తున మృగాల వెంటబడి వధించారు. కొందరు సైనికులు, రజోగుణ పూరిత రాగాలు మ్రోగిస్తుండగా…. భోజరాజు, అతడి పరివారమూ రణోత్సాహం వంటి హుషారుతో అరణ్యమృగాలని వేటాడారు. ఆ వేట అందర్నీ ఎంతో ఉత్సాహ పరిచింది. అందరూ దాన్ని ఎంతో ఆస్వాదించారు.
[ప్రాచీన కాలంలో పాలకులకి, సంపన్నులకి, ప్రజలకి వేట ఎంతో ప్రీతిపాత్రమైనదై ఉండేది. అప్పట్లో అరణ్యాలు దట్టంగా విస్తారంగా ఉండేవి. అడవి జంతువుల సంఖ్య, ప్రజల కంటే ఎక్కువగా ఉండేది. దాంతో ప్రజల, పెంపుడు జంతువుల ప్రాణాలకు, అడవి జంతువుల నుండి ప్రమాదం ఉండేది. జింకలూ, దుప్పుల వంటి సాధుజంతువులు పొలాల మీద పడి మేసేవి. భల్లూకాలు, కుందేళ్ళు దుంప పంటలని తవ్వి పారేసేవి. ఏనుగుల గుంపులు వంటివి, చెఱకు వంటి పైర్లను పీకి పాకాన పెట్టేవి. వాటిని నియంత్రించటానికి వేట అనివార్యమై ఉండేది. ఇప్పటి స్థితి దీనికి విపర్యయం. ఇప్పుడు అడవుల కంటే అడవి ప్రాణుల కంటే జనాల సంఖ్య ఎక్కువ! ఇప్పుడు మనిషి నుండి జంతువులకి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు అడవులని సంరక్షించడం, అడవి జంతువులని సంరక్షించడం అనివార్యమైంది. కాబట్టి ఇప్పుడు వేట నిషిద్దం. అప్పుడు వేట వినోదం!]
అడవిలో భోజరాజు, అతడి పరివారమూ వారం రోజుల పాటు వేట కొనసాగించారు. అడవిలో కౄర, వన్యమృగాల సంఖ్య నియంత్రణలోకి వచ్చిందని రాజుకు తోచింది. వేట ముగించాలని నిర్ణయించాడు. మరునాటి ఉదయాన్నే…. భోజరాజు, తన పరివారంతో కలిసి తన రాజధానియైన ధారా నగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. వేటాడి సంపాదించిన దుప్పికొమ్ములు, పులిచర్మాలు వంటి వస్తువులని గుర్రాలపై వేశారు. ప్రయాణం ప్రారంభించారు. ఆ రోజున ఎండ మండిపోతోంది. నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నట్లుంది. వారం రోజులుగా వేటలో అలిసిపోయిన భోజరాజు, సూర్యతాపానికి మరింత అలసటకి గురై, గుర్రపు స్వారి మాని, పల్లకిలో ప్రయాణించసాగాడు.
అతడి పరివారంలోని సైనికులు, యువకులూ కూడా ఎండ బడలికల కారణంగా నెమ్మదిగా నడవసాగారు. దారిలో వాళ్ళు ఓ పొలం ప్రక్కగా వెళ్ళసాగారు. పచ్చని పైరుతో ఆ పొలం నిండుగా ఉంది. అది శరవణ భట్టు అనే బ్రాహ్మణుడది. [సాధారణంగా ‘శరవణ’ అన్న పేరు తమిళులకు ఉంటుంది. భోజరాజు పరిపాలించిన రాజ్యం, మధ్య భారతదేశంలో, తమిళనాడు దాకా విస్తరించి ఉందేమో ‘నిజమైన చరిత్ర’ తెలిసిన చరిత్రకారులకి తెలియాలి.] శరవణ భట్టు తన పొలంలో పంటని జంతువుల బారి నుండి, పక్షుల బారి నుండి కాపాడుకోవటానికి, పొలం మధ్య ఎత్తుగా మంచె కట్టుకున్నాడు. అదీగాక, మంచె మీద కూర్చుని పొలానికి కావలి కాయటం సులభం కూడాను.
భోజరాజు, పరివారమూ పొలం ప్రక్కగా సాగుపోతున్నప్పుడు, శరవణ భట్టు ఆ మంచె మీదే ఉన్నాడు. అతడు వారిని చూసి “ఓ యన్నలారా! చూస్తే మీరు దూరం నుండి వస్తున్నట్లున్నారు. అలిసిపోయి ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొండి. ఈ పొలం గట్టున నేనో చింత చెట్టు పెంచాను. ఆ చెట్టు నీడలో రవ్వంత సేపు విశ్రమించండి. ప్రక్కనే దిగుడు బావి ఉన్నది. అందులో నీళ్ళు చల్లగా, తియ్యగా ఉంటాయి. చూస్తే మీరంతా బాగా ఆకలితోనూ, దాహంతోనూ ఉన్నట్లుగా తోస్తోంది. మా బావి నుండి చల్లని నీటిని తాగండి. పొలంలో నేను మొక్కజొన్న పంట వేసాను. పైరు ఏపుగా ఎదిగి కంకి బట్టి ఉంది. కంకులు పాలుబట్టి ఉన్నాయి. కడుపునిండా తినండి. మొక్కజొన్న కంకులు మీకు నచ్చకపోతే…. చాళ్ళ మధ్యన దోసపాదులు పెంచాను. దోస కాయలు దోరగా పండి, పగుళ్ళు వారి ఉన్నాయి. పనసతొనల్లా తీయగా, సువాసన వీనుతున్నాయి. ఆకలి దప్పలూ అలసటా, తీర్చుకుని, అప్పుడు పోదురు గానీ, కాస్సేపు ఆగండి” అన్నాడు. భోజరాజు,
అతడి పరివారమూ ఈ మాటలు విని ఎంతో సంతోషించారు. తన రాజ్యంలోని సామాన్య రైతు సైతం, ఇంతటి వితరణ గుణం కలిగి ఉన్నందుకు రాజుకు సంతృప్తి కలిగింది. అతడు తన పరివారానికి, మొక్కజొన్న కంకులూ, దోసకాయలూ తినడానికి, చేలోని బావినీరు తాగటానికీ అనుమతినిచ్చాడు. ఉత్సాహంగా సైనికులూ, యువకులూ, పల్లకీ బోయిలూ పొలంలో జొరబడి ఆకలిదప్పలు తీర్చుకోసాగారు. కొన్ని నిముషాలు గడిచాయి. ఇంతలో శరవణ భట్టు మంచె దిగి క్రిందికొచ్చాడు. అంతే! ఒక్కసారిగా గావుకేక పెట్టాడు. “ఏయ్! ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారు? నా పంటంతా ఎందుకు నాశనం చేస్తున్నారు? చూడబోతే రాజుగారి సైనికుల్లా ఉన్నారు! దొంగల్లా పొలంలో చొరబడి పంటంతా తినేస్తున్నారే!? మిమ్మల్ని కట్టడి చేసేందుకు గానీ, శిక్షించేందుకు గానీ ఎవరూ లేరా? నాలాంటి అమాయక రైతులకి, ఇంకెవరికైనా కష్టం కలిగిస్తే, రాజు గారి దగ్గరికెళ్ళి న్యాయం చెయ్యమని మొరపెట్టుకుంటాము. అలాంటిది… రాజూ, అతడి పరివారమే, నాలాంటి వాడికి అన్యాయం చేస్తే, ఇంకెవరి దగ్గరి కెళ్ళి మొత్తుకోవాలి? పేద బ్రాహ్మణుడి పంట దోచుకునే పాపానికి ఒడిగట్టారు. మిమ్మల్ని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు” అంటూ శాపనార్దాలు పెడుతూ అరవసాగాడు.
శరవణ భట్టు మాటలకి భోజరాజు పరివారం దిగ్ర్భమ చెందారు. విషణ్ణ వదనాలతో నిలబడిపోయారు. వారి ముఖాల్లో, కొంత అయోమయం, కొంత అపరాధ భావన, కలగలసి పోయాయి. పొలం నుండి బయటకి వచ్చేసారు. ఇంతలో శరవణ భట్టు మళ్ళీ మంచె పైకి ఎక్కాడు. వెళ్ళుపోతున్న సైనికుల్ని చూసి “అయ్యో భగవంతుడా! అన్నలారా ఆగండి! ఎందుకని వెళ్ళిపోతున్నారు? మీ ఆకలి తీర్చుకోకుండానే పొలం వీడి పోతున్నారేం? నా ఆతిధ్యంలో ఏమైనా లోపమున్నదా? ప్రియమైన సోదరులారా! రండి. దయచేసి వెళ్ళకండి! ఆకలీ దాహమూ తీర్చుకొండి. విశ్రాంతి తీసుకోండి. ఎండవేడి తగ్గాక, తిరిగి ప్రయాణం ప్రారంభిద్దురు గానీ!” అన్నాడు ఎంతో వేడికోలుగా! పూర్తిగా విభిన్నమైన, విచిత్రమైన ఈ రకపు ప్రవర్తనకు, శరవణ భట్టుని చూసి, భోజరాజు అతడి పరివారమూ నివ్వెర పోయారు. భోజరాజు తన ప్రధానమంత్రిని పిలిచి “బుద్దిసాగారా! గమనించావా!? ఈ బ్రాహ్మణుని ప్రవర్తన కడు వింతగా నున్నది. మంచె మీద ఉన్నప్పుడు అతడి మాటతీరు ఎంత దయాపూర్ణమై ప్రేమపూరితమై ఉన్నది. మంచె దిగినంతనే కర్ణ కఠోరమైన మాటలాడుచున్నాడు. ముందటి ప్రవర్తనకు, దీనికీ పొంతనే లేదు. దీని కేదో ప్రబల కారణం ఉండి ఉండాలి” అన్నాడు. బుద్ది సాగరుడు “నిజము మహారాజా! నేనూ దీని గురించే ఆలోచించుతూ ఉన్నాను. ‘మంచె ఉన్న స్థానంలోని మట్టిలో ఏదో మహత్తు ఉండి ఉండవచ్చు’ అని నా ఊహ” అన్నాడు, సాలోచనగా! భోజరాజు “అదీ నిజమై ఉండవచ్చు. మనము ఆ రైతుతో మాట్లాడెదము గాక! అతణ్ణి వెంటనే పిలిపించండి” అన్నాడు.
ఉత్తర క్షణంలో శరవణ భట్టు భోజరాజు ఎదుట ఉన్నాడు. భోజరాజు మందహాసంతో “ఓయీ శరవణ భట్టూ! మాకు నీ పొలము పై ఆసక్తిగా ఉన్నది. నీకు ఇంతే సారవంతమైనదీ, విస్తీర్ణము గలదీ అయిన మరియొక భూమినిచ్చెదను. ఇంకనూ నీకు అయిదు గ్రామములపై పన్ను వసూలు చేసుకొను హక్కునిచ్చెదను. బదులుగా నీ పొలమును నాకు అమ్మివేయుము” అన్నాడు. శరవణ భట్టు వినమ్రతతో “మహారాజా! ఈ రాజ్యమున ఏదైనా మీ సొత్తు! అన్నిటిపైనా మీకు అధికారమున్నది. మీరు నా పొలము ఊరికినే తీసికొన్ననూ, మిమ్ములను అభ్యంతర పరచు వారెవ్వరూ లేరు. అట్టిచో మీరు నాపట్ల ఎంతో దయ చూపించుచున్నారు. మీరు ఆదర్శ ప్రభువులు! మీ ధర్మబుద్ది దేవతలకు సరితూగ గలది. నా పొలమునకు బదులుగా మీరు ఎంతో ఇచ్చుచున్నారు. నేనెంతో సంతోషముగా నా పొలమును ఈ క్షణమే మీ పరము చేయిచున్న వాడను” అన్నాడు. బుద్దిసాగరుడు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. శరవణ భట్టుకు వేరొక పొలమునూ, ఇతర బహుమతులూ ఇచ్చాడు. శరవణ భట్టు పొలంలో మంచె నిర్మించిన చోట తవ్వేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఒక మంచి ముహుర్తాన, పూజాదికాలు నిర్వహించి, తవ్వకం ప్రారంభించారు.
The post భర్తృహరి శృంగార శతకము – Part 1 appeared first on Telugu Sex Stories.