అప్పుడు సంభవించిందొక అద్భుతం!
ఆకాశం నుండి దేవరధం రెక్కలల్లార్చుతూ దిగి వచ్చింది. బ్రహ్మ రాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోయాడు. చంద్రవర్ణుడు సంభ్రమంగా చూస్తూన్నాడు.
ఆ దివ్యపురుషుడు చంద్రవర్ణుడు వైపు తిరిగి “ప్రియ శిష్యా, చంద్రవర్ణా! నేనొక యక్షుడను. సకల శాస్త్రాలూ నేర్చిన వాణ్ణి. అయితే దురదృష్టవ శాత్తూ ఆ పాండిత్యం నాలో అహంకారాన్ని పెంచింది. విద్యా గర్వాంధుడినై మహర్షులని అగౌరవించాను. కోపోద్రిక్తులై వారు, నన్ను ‘రాక్షసుడవు కమ్మని’ శపించారు. క్షమించమని వారి పాదాల బడి ప్రార్దించగా, దయతో వాళ్ళు నాకు శాపవిమోచనం అనుగ్రహించారు. యోగ్యుడైన శిష్యుడికి విద్యాదానం చెయ్యవలసిందిగా చెప్పారు. ఆనాటి నుండి, ఈ రావి చెట్టుపై నివసిస్తూ, తగిన శిష్యుని కోసం ఎదురు చూస్తూ, తపమాచరిస్తూ కాలం నడుపుతున్నాను.
నా భాగ్యమా అన్నట్లు, దైవమే అనుగ్రహించి నిన్ను నా వద్దకు పంపించాడు. జ్ఞానతృష్ణతో నీవు నన్ను వెదుక్కుంటూ వచ్చావు. వినయ విధేయలతో విద్యార్జన చేశావు. నీ కారణంగా ఇన్నాళ్ళకు శాప విముక్తుడ నైనాను.
నాయనా చంద్రవర్ణా! నీకివే నా ఆశీస్సులు. జీవితంలో శాంతి సంతోషాలు, సకల భాగ్యాలూ పొందెదవు గాక! నేనిదే నా లోకమునకు బోవుచున్నాను. దేవుడు నిన్ను అనుగ్రహించు గాక!” అంటూ, అప్పటి వరకూ బ్రహ్మరాక్షసుడులా ఉన్న యక్షుడు, చంద్రవర్ణుడి తలపై చేయి ఉంచి దీవించాడు.
చంద్రవర్ణుడు గురువుకి వినయంగా నమస్కరించి, సంతోషమూ, ఎడబాటు దుఃఖమూ ముప్పిరిగొనగా వీడ్కొలు పలికాడు. దివ్యవిమానం ఆకసాన అంతర్హితమైంది. చంద్రవర్ణుడు అప్పటి వరకూ గురువు చెప్పిన శ్లోకాలు వ్రాసి ఉన్న రావి ఆకులని మూటగట్టుకున్నాడు. ఇక తిరుగుప్రయాణమైనాడు. మార్గవశాన అతడు కన్యాపురం అనే పట్టణాన్ని చేరాడు. అప్పటికే అతడు బాగా అలిసిపోయాడు. యక్షుడు చెప్పిన మంత్ర ప్రభావం పూర్తి కావస్తుండటంతో, అతణ్ణి ఆకలి, దప్పిక, నిద్ర ముప్పిరిగొన్నాయి.
అప్పటికి అతడొక ధనికుల ఇంటి ముందరికి చేరాడు. ఆ ఇంటి గుమ్మం అందమైన దీపాలతో, తోరణాలతో అలంకరించి ఉంది. ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు పరచి ఉన్నాయి. అదెవరో సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల ఇల్లయి ఉంటుందనుకున్నాడు చంద్రవర్ణుడు. ఆ ఇంటి అరుగుపై జారగిలబడ్డాడు. అప్పటికే అతణ్ణి ఆక్రమించిన నిస్సత్తువ కారణంగా క్షణాలలో స్పృహ కోల్ఫోయాడు.
అతడనుకున్నట్లు అది బ్రాహ్మణుల ఇల్లు కాదు. [ఆ రోజులలో భారత దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఆచరణలో ఉండేది. సమాజంలో నాలుగే వర్గాలుండేవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర!] ఆ భవంతి రాజ నర్తకియైన ఒక వేశ్యది. ఆమె పేరు అలంకార వల్లి. [ఆమె పేరుకు అర్ధం అలంకారం కొరకు ఉపయోగించు దండ లేదా లత అని!] అలంకార వల్లి, అందమైన లత వంటి శరీర సౌందర్యం కలది. ఒంపు సొంపులతో కూడిన ఎంత అందమైన దేహము కలదో, అంతకంటే సౌకుమార్యమైన మనస్సు కలది. నర్తకిగా దైవభక్తీ, ధర్మనిరతీ గలది. తన వృత్తి ధర్మం పాటించడంలో నీతి నియమాలు పాటించునట్టిది.
అప్పటికి రాత్రియైనది. దేవాలయములో నాట్యం వంటి పనులన్నీ ముగించుకొని, అలంకార వల్లి ఇల్లు చేరవచ్చింది. చీకటి మాటున ఆమె తన ఇంటి అరుగుపై ఎవరో ఒరిగి ఉండటాన్ని గమనించింది. “ఎవరూ?” అంటూ తట్టి లేప ప్రయత్నించింది గానీ, అరుగుపై బడి ఉన్న వ్యక్తి పలక లేదు, ఉలకలేదు. అంతట ఆమె ఇంటిలోనికి బోయి పెద్ద దీపము తెచ్చి చూసినది.చూడగా ఏమున్నది?
ఇంటి అరుగుపై ఆదమరిచి పడి ఉన్న అందమైన యువకుడు[చంద్రవర్ణుడు]. రావి ఆకుల మూట అతడి తలక్రింద ఉన్నది. అలంకార వల్లి దాస దాసీ జనాన్ని పిలిచి, అతణ్ణి లోపలికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. చంద్రబింబము వంటి ముఖము, చంద్రకాంతి వంటి దేహకాంతి గల చంద్రవర్ణుని చూసి ఆమె ఆశ్చర్యాన్ని పొందింది. అతడిపై ఆమెకు మోహము, ఆకర్షణా కలిగాయి.
అతడి వివరాల కోసమై మూట విప్పి చూసింది. రావి ఆకులపై సంస్కృత శ్లోకాలున్నాయి. అతడెవ్వరో గొప్ప పండితుడై ఉంటాడని తోచింది. ఆమెకతడిపై ఎంతో ప్రేమ కలిగింది. వెంటనే అలంకార వల్లి వైద్యులని రప్పించింది. వాళ్ళతణ్ణి క్షుణ్ణంగా పరీక్షించి “ఓ అలంకార వల్లీ! ఈ యువకుడు ఆరునెలలు నుండి నిద్రాహారాలు లేక యున్నాడు. కాబట్టే ఈ విధముగా స్పృహ కోల్పోయినాడు. ఇతడి నిట్లే వదలి వైచిన మరణించట తధ్యం” అన్నారు.
ఇది విని అలంకార వల్లి మిగుల దిగులు చెందింది. ఆందోళన నిండిన హృదయంతో “అయ్యా! మీరు గొప్ప వైద్యులు! శాస్త్రములు తెలిసిన వారు. ఇతడి నెట్లు కాపాడ గలము? దయ చేసి చెప్పండి” అన్నది.
వైద్యులు “ప్రతి దినమునా నీవు ఒక పడి బియ్యమును వండి, ఒక పడి ఆవు నేతితో కలిపి, మెత్తని లేహ్యము వలె చేయుము. ఆ లేహ్యముతో ఈతని దేహమును తల నుండి కాలి వేళ్ళ వరకూ మర్ధనా చేయవలయును. దినమున కిట్లు రెండు మారులు చేయవలెను. నెయ్యి, అన్నముల సారము, సూక్ష్మమైన ఇతడి దేహ రంధ్రములు ద్వారా నరములకు చేరి, ఇతడికి శక్తి రాగలదు. ఆ విధంగా అతడి ప్రాణాలు కాపాడవచ్చును. కొన్ని దినములు లిట్లు చేసిన ఇతడు నిద్ర నుండి లేచినట్లుగా స్పృహ చెందగలడు” అన్నారు. [పడి అన్నది ఇప్పటికీ గ్రామీణుల్లో ఆదరణ ఉన్న కొలమానం. ఒక పడి అంటే ఒకటిన్నర కిలో గ్రాములు.]
అలంకార వల్లి ఎంతో సంతోషంతో వైద్యులకు కృతజ్ఞతలు తెల్పింది. విలువైన బహుమతులూ ఇచ్చింది. దాసీజనుల చేత సిద్దము చేయించిన నేయి అన్నముల లేహ్యముతో, చంద్రవర్ణుడి దేహానికి మర్ధనా చేస్తూ, స్వయంగా తానే దగ్గరుండి సేవలు చేసింది. ఈ విధంగా ఎనిమిది రోజులు గడిచాయి.
తొమ్మిదో రోజున చంద్రవర్ణుడికి స్పృహ వచ్చింది. ఆ సమయానికి అలంకార వల్లి ఆ గదిలో లేదు. చంద్రవర్ణుడు చుట్టూ పరికించి చూశాడు. గది అలంకారాన్ని, పరిసరాలనీ చూసే సరికి, అతడికి ఆ ఇల్లు బ్రాహ్మణులది కాదనీ, వేశ్యాంగన ఇల్లనీ అర్ధమైంది. తన ఆకుల మూటను తీసుకుని, ఆ ఇంటి నుండి బయట పడాలని, చప్పుడు చెయ్యకుండా బయలు దేరాడు.
ఇంతలో అలంకార వల్లి చూడనే చూసింది. చప్పున అతడి చేయి పట్టుకుని ఆపింది. “ఓ యీ బ్రాహ్మణ యువకుడా? నేను నీకు పరిచర్యలు చేశాను. నీకు స్పృహ లేని ఇన్నిరోజులూ కంటికి రెప్పవలె నిన్ను కాపాడాను. ఈ ఎనిమిది రోజులుగా నేనే స్వయంగా నిద్రాహారాలు మాని, నీకు సేవలు చేశాను. స్పృహ లేని నీకు వైద్యం చేయించాను. నీ ప్రాణాలు కాపాడాను. ఆ విధంగా చెప్పాలంటే నేను నీ ప్రాణదాతను. అటువంటిది, కనీసం ఒక్కమాటయినా మాట్లాడకుండా, అధమపక్షం కృతజ్ఞత అయినా చెప్పకుండా నా ఇల్లు విడిచి పోతున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నిన్ను నేను ఎట్టిపరిస్థితులలోనూ వెళ్ళ నివ్వను” అంటూ అడ్డం పడింది.
చంద్రవర్ణుడు బిత్తరపోయాడు. ఉత్తర క్షణం తేరుకుని “నర్తకీమణీ! నన్ను కాపాడినందుకు ఎంతగానో కృతజ్ఞుణ్ణి. కానీ నన్ను వెళ్ళనీయక ఎందుకు అభ్యంతర పెడుతున్నావు?” అన్నాడు. ఒక్కక్షణం అలంకార వల్లి మౌనంగా తలవంచుకుంది. వెంటనే “ఓ బ్రాహ్మణ సుందరుడా! నేను నీయందు ప్రేమ కలిగి ఉన్నాను. నిన్ను పెండ్లియాడ గోరుతున్నాను. నీ ప్రాణములను కాపాడిన నా పైన కోపగించక, నా కోరికని మన్నింపుము” అన్నది.
చంద్రవర్ణుడిది విని హతాశుడైనాడు. అలంకార వల్లి అతడి ఎదుట నిలబడి ఆర్తితో చూస్తూ ఉన్నది. నిజానికి ఆమె అందగత్తె! మెరుపు తీగకు మాటలోచ్చినట్లు ఎదురుగా నిలబడి ఉంది. చంద్రవర్ణుడు మార్దవంగా “నర్తకీమణి! నేను బ్రాహ్మణుడను. మన వివాహము పొసగదు. దయ యుంచి నన్ను వెళ్ళనివ్వు” అన్నాడు.
అలంకార వల్లి అందుకు అంగీకరించలేదు. క్రమంగా వారి మధ్య వాదులాట రేగింది. చంద్రవర్ణుడు ఆమెని దాటుకుని వీధిలోకి వచ్చాడు. అలంకార వల్లి విడిచి పెట్టలేదు. వీధిలో జరిగే ఈ జగడాన్ని చూడటానికి చుట్టూ జనం మూగారు. చారుల వలన ఈ వార్త రాజుకు చేరింది. కన్యాపురానికి రాజు శుద్దవర్మ[అతడి పేరుకు అర్దం శుద్దుడు అని, అంటే Mr.Clean అన్నమాట.] అతడు రాజ భటులని పిలిచి వాళ్ళని సభకి తీసుకురమ్మన్నాడు. భటులు అలంకార వల్లినీ, చంద్రవర్ణుడినీ రాజసభకు తీసుకువెళ్ళారు.
రాజు చంద్రవర్ణుని చూసినంతనే ముచ్చట పడ్డాడు. ‘ఏమి ముఖవర్చస్సు! ఈతడు బాల బృహస్పతి వలె నున్నాడు’ అనుకున్నాడు. పైకి “ఎందుకు మీరు వీధినబడి అనాగరికుల వలె జగడము లాడు చున్నారు?” అని ప్రశ్నించాడు. చంద్రవర్ణుడు “మహారాజా! క్షమించాలి. నేను బ్రాహ్మణుడను. కొన్ని దినముల క్రిందట నేను, ఈ యువతి ఇంటి ఆరుగుపైన నిద్రించితిని. అది బ్రాహ్మణుల ఇల్లై ఉండవచ్చని తలచితిని. అది ఈ వెలయాలి ఇల్లని తెలియనైతిని. నా అలసట కారణంగా నేనే విషయము ఎరుగనైతిని.
ఇప్పుడీమె, నాకు స్పృహ లేనన్ని దినములూ నాకు వైద్యము చేయించినదనీ, నాకు స్వయముగా సపర్యలు చేసినదనీ, నా ప్రాణములు నిలిపిదనీ చెప్పుచున్నది. ప్రత్యుపకారముగా ఆమెను వివాహ మాడవలెనని నన్ను బలవంత పెట్టుచున్నది” అన్నాడు. అతడి దంతా చెబుతున్నంత సేపూ, రాజు శుద్దవర్మ అతడి వైపే చూస్తున్నాడు. మనస్సులో ‘ఇతడి ముఖవర్చసు చూడగా బ్రహ్మజ్ఞానిలా కనబడుతున్నాడు. అందం, విద్వత్తూ ఇతడిలో పోటీ పడుతున్నవి. సుగుణ శీలియైన ఇతడికి నా కుమార్తె చిత్రరేఖ నిచ్చి వివాహము చేసిన బాగుండును కదా?’ అని ఆలోచించినాడు.[చిత్ర రేఖ అంటే చిత్రమైన రేఖ అని అర్ధం. ]
అతడిలా ఆలోచిస్తున్నప్పుడే, సభలోని మంత్రి, రాజ పురోహితుడూ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచించారు. రాజు శుద్దవర్మ సభలోని శాస్త్రపురోహితులని, పెద్దలని… అలంకార వల్లి, చంద్రవర్ణుల తగువుని తీర్చమని అడిగాడు.
పండితులు “మహారాజా! అలంకార వల్లి వాదనలోనూ న్యాయముంది. ఆమె సమయానికి ఆదుకోకపోయి ఉంటే, చంద్రవర్ణుడు జీవించి ఉండేవాడు కాదు. చంద్రవర్ణుడి వాదనలోనూ న్యాయమున్నది. బ్రాహ్మణుడైన అతడు, వేశ్యాంగన అయిన అలంకార వల్లిని నిరాకరిస్తున్నాడు. అలంకార వల్లి పుట్టుకే, చంద్రవర్ణుడి అభ్యంతరమైతే ఇందుకొక తరుణోపాయముంది.
ఒక బ్రాహ్మణుడు ఇతర వర్గమునకు చెందిన స్త్రీని వివాహమాడదలిచిన ఒక మార్గమున్నది. అతడు అదే ముహుర్తమున ఒక బ్రాహ్మణ యువతినీ, క్షత్రియ యువతినీ, వైశ్య యువతినీ, శూద్ర యువతినీ వివాహ మాడవలెను.
అలాగ్గాక, బ్రాహ్మణుడు ఒక్క యువతనే వివాహమాడదలిచిన, ఆ యువతి బ్రాహ్మణ యువతియే అయి ఉండవలెను” అని తేల్చి చెప్పారు. రాజు శుద్దవర్మ “చంద్రవర్ణుని చూడ నాకు ముచ్చట కలిగినది. అతడి అందచందాలకు, గుణశీలాలకూ మెచ్చితిని. అందుచేత నా ఒక్కగానొక్క పుత్రికయైన చిత్రరేఖను, ఇతడికిచ్చి వివాహము చేయ సంకల్పించితిని” అన్నాడు, సాభిప్రాయంగా చంద్రవర్ణుడి వైపు చూస్తూ!
వెంటనే మంత్రి సోమశేఖరుడు లేచి “మహారాజా! నేనూ అట్టి ఆలోచననే చేసి ఉన్నాను. నేను వైశ్యుడను. నా పుత్రిక కోమాలాంగిని ఇతడి కిచ్చి వివాహము చేసేదను” అన్నాడు. [కోమలాంగి అంటే సుకుమారమైన దేహము కలది అని అర్ధం.]
అంతలో రాజపురోహితుడు లేచి “ప్రభూ! నేనూ నా కుమార్తె కళ్యాణిని ఇతడి కిచ్చి వివాహము చేయగలవాడను” అన్నాడు.
చంద్రవర్ణుడిందుకు సమ్మతించాడు. వధువుల సమ్మతి బడసి అందరూ సంతోషించారు. ఒక శుభముహుర్తమున బ్రాహ్మణ యువతి కళ్యాణి, వైశ్య యువతి కోమలాంగి, క్షత్రియ యువతి చిత్రరేఖ, శూద్ర యువతి అలంకార వల్లిలతో చంద్రవర్ణుడి వివాహం మహా వైభవంగా జరిగింది.
ఒక శుభముహుర్తమున బ్రాహ్మణ యువతి కళ్యాణి, వైశ్య యువతి కోమలాంగి, క్షత్రియ యువతి చిత్రరేఖ, శూద్ర యువతి అలంకార వల్లిలతో చంద్రవర్ణుడి వివాహం మహా వైభవంగా జరిగింది.రోజులు హాయిగా గడుస్తున్నాయి. చంద్రవర్ణుడు తన మాట తీరు, నడవడికతో అందరి మనస్సులనూ ఆకట్టుకున్నాడు. అతడికి నలుగురు కుమారులు కలిగాడు. ఒకో భార్యకూ ఒకో పుత్రుడన్న మాట. బ్రాహ్మణ యువతి కళ్యాణి కన్న కుమారుడికి పల్లవర్షి అనీ, క్షత్రియ యువతి చిత్రరేఖ కుమారుడికి విక్రమాదిత్యుడనీ, వైశ్య యువతి కుమారుడికి భట్టి అనీ, శూద్ర యువతి అలంకార వల్లి కుమారుడికి భర్తృహరి అనీ, చంద్రవర్ణుడు నామ కరణం చేశాడు.
పిల్లలందరూ శుక్ల పక్ష చంద్రుడిలా దిన దిన ప్రవర్దమానమౌతున్నారు. వారికి విద్యాభ్యాసం చేయవలసిన వయస్సు రాగానే అక్షరాభ్యాసం చేయించారు. బాలురు చక్కగా విద్యల నభ్యసిస్తున్నారు. కాలక్రమంలో రాజు శుద్దవర్మ పరలోకగతుడైనాడు. అతడికి చిత్రరేఖ ఒక్కగానొక్క కుమార్తె అయినందున, ఆమె భర్త అయిన చంద్రవర్ణుడు కన్యాపురానికి రాజైనాడు. అతడి రాజ్య పరిపాలన ఆదర్శనీయంగా సాగుతోంది. ధర్మబద్దంగా రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు. ప్రజలంతా ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. వాతావరణమూ అనుకూలంగా ఉండి పంటలు బాగా పండుతున్నాయి. అంతటా ప్రశాంతమూ, సంతోషమే!
చంద్రవర్ణుడు ఒక ప్రక్క రాజ్యభారం వహిస్తూనే, మరో ప్రక్క తన తనయుల విద్యాబుద్దుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. తానే స్వయంగా విద్యలు నేర్పుకున్నాడు. [ఎవరైతే తల్లిదండ్రులే గురువులుగా, తల్లిదండ్రుల నుండి విద్యల నభ్యసించారో, వారు జీవితంలో మరింత సఫలీ కృతులయ్యారు, చరిత్రలో ప్రసిద్దులయ్యారు. భట్టి విక్రమాదిత్యులు తమ తండ్రి చంద్రవర్ణుని కంటే కూడా మరింత ప్రసిద్దులు. చంద్రవర్ణుడు, శాపవశాత్తు బ్రహ్మరాక్షసుడైన దివ్య పురుషుడి వద్ద విద్యలనభ్యసించినా, స్వయంగా తండ్రి వద్దే విద్యలనభ్యసించిన భట్టి విక్రమాదిత్యులు మరింత ఘనకార్యాలు సాధించారు.
తల్లిదండ్రులే గురువులైతే, పిల్లలు మరింత శోభిల్లుతారు. అంటే నేనిక్కడ గురువులను తక్కువ చేసి మాట్లాడటం లేదు. గురువులతో పాటు, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు గురుత్వం వహిస్తే, వారు మరింత వృద్దిలోకి వస్తారని చెప్పటమే నా ఉద్దేశం. మన భారతదేశ చరిత్రలో కూడా ఇందుకు ఎందరో మహానుభావులు ఉదాహరణలై నిలిచారు. ఛత్రపతి శివాజీ, తల్లి జిజియా భాయి నుండి స్ఫూర్తి పొందిన వాడే!
ఇప్పటికీ, ఎందరో కవి గాయక పండితులు, తమ అభిరుచి తల్లిదండ్రుల నుండీ సంక్రమించిందనీ, తొలి పాఠాలు తల్లి లేదా తండ్రి గారి నుండి నేర్చామనీ చెప్పటం మనం చూస్తూనే ఉన్నాం.] మరికొన్ని వసంతాలు గడిచాయి. చంద్రవర్ణుడి నలుగురు పుత్రులూ పెరిగి పెద్దయ్యారు, చంద్రవర్ణుడు వృద్దుడైనాడు. వార్ధక్య సహజంగా చంద్రవర్ణుడికి మరణకాలం సమీపించింది. మరణశయ్యపై ఉన్న చంద్రవర్ణుడు, తన చుట్టూ నిలిచి ఉన్న పుత్రులను చూసాడు. అతడి దృష్టి భర్తృహరి మీద నిలిచింది. తదేకంగా అతడి వైపు చూస్తూ కన్నుల నీరు నింపుకున్నాడు.
చుట్టూ ఉన్న అందరూ అది గమనించారు. ‘బహుశః చంద్రవర్ణుడికి అలంకార వల్లిపైన, ఆమె పుత్రుడైన భర్తృహరి పైన మమకారం మెండుగా ఉంది కాబోలు!’ అనుకున్నారు. భర్తృహరి తండ్రివైపే చూస్తున్నాడు. తండ్రి మనస్సులో మెదలుతున్న ఆలోచనలు భర్తృహరికి స్పురించాయి. అతడు మెల్లిగా తండ్రిని సమీపించి “తండ్రీ! మీరు దిగులు చెందకండి. సద్భాహ్మణ సంజాతులైన మీరు, శూద్ర వనిత యందు నన్ను కన్నందున, ఉత్తమగతులు పొందలేరేమో నని దుఃఖిస్తున్నట్లుగా ఉన్నారు. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. మీకు ఉత్తమ లోకాలు ప్రాప్తించుటకై నేను వివాహం చేసుకోను. అధవా వివాహం చేసుకున్నా, సంతానాన్ని పొందను. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు ముక్తి కలుగుతుంది” అన్నాడు.
[వర్ణాశ్రమ నమ్మకాలు అప్పటి కాలంలో ఉండేవి. జానపద కథల్లోని అలాంటి ఘట్టాలను పట్టుకొని తింగరి హేతువాదులూ, తిక్క ఆధునిక వాదులూ వాదనలు చేస్తే…. వాళ్ళకి దండేసి దండం పెట్టడం తప్పితే ఏమీ చెప్పలేం!]
చంద్రవర్ణుడది విని ప్రశాంత చిత్తుడయ్యాడు. మిగిలిన పుత్రులని తన శయ్యకు దగ్గరగా రమ్మని పిలిచాడు. నెమ్మదైన కంఠంతో “నాయనలారా! నేను మీ తల్లులను వివాహమాడటానికీ, ఈ రాజ్యానికి రాజుని కావటానికీ, భర్తృహరి తల్లియైన అలంకార వల్లి యే కారణం. ఆమె నా ప్రాణదాత! కాబట్టి నాదో కోరిక! నా తర్వాత భర్తృహరి రాజు కావాలి. మీరంతా యువరాజులై అతణ్ణి సేవిస్తూ సహకరించండి” అన్నాడు.
భట్టి విక్రమాదిత్యులు వినయంగా తండ్రి ఆజ్ఞను స్వీకరించారు. పల్లవర్షి ఓ అడుగు ముందుకు వేసి “తండ్రీ! నన్ను మన్నించండి. నాకీ రాజ్య సంపద మీద గానీ, ఇహలోక సౌఖ్యం గురించి గానీ ఆసక్తి లేదు. నేను తపమాచరించి తరించ గోరుచున్నాను. కాబట్టి సన్యాసాశ్రమ వృత్తి స్వీకరించి, అడవులకు బోయి తపస్సు చేసుకో దలిచాను. దయయుంచి నాకు అనుమతి ఇవ్వండి” అని ప్రార్దించాడు.
చంద్రవర్ణుడికి పల్లవర్షి పరిణితి, భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి తెలుసు. అందుచేత అతణ్ణి అర్ధం చేసుకున్న వాడై, కుమారుణ్ణి దీవించి, అడవులకు పోయి తపస్సు చేసుకునేందుకు అనుమతించాడు. ఆపైన చంద్రవర్ణుడు మంత్రి పురోహితులను దీవించి, భర్తృహరిని రాజు గానూ, భట్టి విక్రమాదిత్యులను యువరాజులు గానూ పట్టాభిషేకం చేసేటందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు.
పట్టాభిషేక మహోత్సవం అతి వైభవంగా నిర్వహించబడింది. చంద్రవర్ణుడు సంతృప్తిగా, మనశ్శాంతిగా అనుభూతించాడు. ఒకనాటి ఉత్తమ ఘడియలలో అతడు దివంగతుడయ్యాడు.